కశ్మీర్ వేర్పాటువాద నేత విడుదల
శ్రీనగర్: కశ్మీర్ అతివాద నాయకుడు, వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నేత మస్రత్ ఆలమ్(44)ను శనివారం రాత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. బారాముల్లా జైలు నుంచి విడుదలైన ఆయనను షహీద్ గంజ్ పోలీసుస్టేషన్‌లో కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ రాష్ట్ర నూతనముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ నిర్ణయం తీసుకోవడంతో మస్రత్ కూడా విడుదలయ్యారు. మస్రత్ రాజకీయ ఖైదీగానే అరెస్టయినా, తర్వాత ఆయనపై అనేక అభియోగాలు నమోదయ్యాయి.
హురియత్ నేత సయీద్ అలీ షా గిలానీకి ఆంతరంగికుడైన ఆలమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008-2010 మధ్య పెద్ద ఎత్తున ర్యాలీలు, రాళ్లదాడులు చేసేలా కీలకపాత్ర పోషించాడని, దేశంపై యుద్ధం ప్రకటించాడని కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుకు తోడ్పడే సమాచారం ఇచ్చినవారికి రూ. 10 లక్షల రివార్డును ప్రకటించారు. 2010లో అతడు అరెస్టయ్యాడు. కాగా, సీఎం ఆదేశాలపై.. క్రిమినల్ అభియోగాలు లేని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తామని డీజీపీ రాజేంద్ర చెప్పారు. మస్రత్ ప్రమేయమున్న దాడుల్లో పలువురు మరణించడాన్ని ప్రస్తావించగా.. త్వరలోనే వివరణ ఇస్తామని డీజీపీ తెలిపారు.