వాజ్‌పేయిలా కశ్మీరీల హృదయాలు గెలుచుకోండి
న్యూఢిల్లీ: రగులుతున్న కశ్మీర్ ప్రజలతో చర్చించి లోయలో సమస్యను పరిష్కరించాలని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని మోదీని కోరారు. ‘కశ్మీరీలతో మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఈ విషయంలో ప్రధాని చొరవ చూపుతారని ఆశిస్తున్నా. నాడు వాజ్‌పేయిలా నేడు మోదీ కూడా సమస్యను పరిష్కరించి కశ్మీరీల హృదయాలు గెలవాల్సిన అవసరం ఉంది’ అని మెహబూబా అన్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఇక్కడ సమీక్షించారు. ఇందులో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు ఏకే దోవల్‌తో పాటు మెహబూబా పాల్గొన్నారు.
లోయలో నెలకు పైగా సాగుతున్న హింసతో 55 మంది పౌరులు మరణించారని, ఎంతో మంది గాయపడ్డారని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్‌లకు తమ రాష్ట్రం ఓ వారధిలా ఉండగలదన్నారు. కశ్మీర్ అల్లర్లపై ప్రధాని ఇంత వరకు నోరు విప్పకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.