సాక్షి, న్యూఢిల్లీ : కల్లోల కశ్మీర్‌లో ఉద్రిక్తతల నడుమ బతకలేక 29 ఏళ్ల పాటు అజ్ఞాతంగా గడిపిన కశ్మీరీ పండిట్ వ్యాపారవేత్త రోషన్ లాల్ మవా తిరిగి స్వస్ధలం శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో తన వ్యాపారాన్ని పునరుద్ధరించేందుకు అడుగుపెట్టాడు. పుట్టిన చోటే కన్నుమూయాలనే కోరికతో రూ 500 కోట్ల వ్యాపారాన్నీ వదులుకుని పోయిన చోటే వెతుక్కోవాలంటూ సొంతూరికి చేరుకున్న 75 ఏళ్ల మవాకు శ్రీనగర్‌లో ముస్లింలు, హిందువులు ఏకమై స్వాగతించారు.
వేర్పాటువాదుల ప్రాబల్యం కలిగిన శ్రీనగర్ పాతబస్తీలో ఉగ్ర మూకలు 1990లో జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మవా ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని అక్కడే స్ధిరపడ్డా తన చివరి రోజుల్లో స్వస్ధలంలో గడపాలన్న ఆయన కల మాత్రం ఇప్పటికి నెరవేరింది. 29 ఏళ్ల తర్వాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యాపారాన్ని బుధవారం తిరిగి ప్రారంభించారు. మవా తిరిగి తన షాప్‌ను ప్రారంభించే సమయంలో పెద్దసంఖ్యలో స్ధానిక ముస్లింలు చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు.
మవాను స్వాగతిస్తూ ఆయనకు సంప్రదాయ తలపాగా అమర్చి ఆయన కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు స్వీట్లు పంచుకుని వేడుక చేసుకున్నారు. 1990, అక్టోబర్ 13న కొందరు తనపై కాల్పులకు తెగబడంతో తన పొత్తికడుపులోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయని, ఘర్షణల ప్రభావంతో తాము ఢిల్లీకి వలస వెళ్లి అక్కడ స్ధిరపడ్డామని మవా చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో వ్యాపారం వేళ్లూనుకున్నా తన హృదయం, ఆత్మ కశ్మీర్ కోసమే పరితపించేవని చెప్పారు.
ఢిల్లీలో తమ వ్యాపారం అద్భుతంగా రాణించినా తనకు ప్రశాంతత లేదని అన్నారు. చివరి రోజులు కశ్మీర్‌లో గడపాలన్న చిరకాల వాంఛ ఇప్పటికి తీరిందని చెప్పారు. కాగా, చావైనా..బతుకైనా కశ్మీర్‌లోనేనని తన తండ్రి తరచూ చెబుతుండేవాడని, ఆయన కొడుకుగా ఇప్పుడు తాను ఆయన కోరికను నెరవేర్చానని మవా కుమారుడు డాక్టర్ సందీప్ అన్నారు. రూ 500 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నా గతంలో తాము అనుభవించిన వాతావరణం కోసం కశ్మీర్‌లో సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని మవా కుటుంబం చిన్నస్ధాయిలో ఆరంభించడం విశేషం. మరోవైపు తమ ఊరి బిడ్డ తిరిగి జన్మభూమిలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని స్ధానిక ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్‌లు అందరూ తిరిగి రావాలని కోరుకుంటున్నామని, ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవని స్ధానిక ముస్లిం ముఖ్తార్ అహ్మద్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment