
హైదరాబాద్ రండి.. మా బిర్యానీ పెడతాం: కేసీఆర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు అందరూ హైదరాబాద్ రావాలని.. వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ బిర్యానీ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తమకు పొరుగు రాష్ట్రాలన్నింటితో సత్సంబంధాలు కావాలని, ఏ రాష్ట్రంతోనూ కొట్లాడబోమని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. అన్నింటితోనూ మంచి సంబంధాలే కోరుకుంటున్నట్లు చెప్పారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో ఎంఓయూ మీద సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ప్రధానంగా నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు చెప్పామని గుర్తుచేశారు. అలా నీళ్లు ఇవ్వడంలో ఇప్పుడు పడినది పెద్ద ముందడుగని అన్నారు. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని, మనం మనం గొడవపడితే ప్రయోజనం ఉండదని, కొన్ని నీళ్లు మహారాష్ట్ర వాడుకుంటే కొంత మనం వాడుకుందామని ఏపీ ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ఐదు బ్యారేజీలు కడతారని, నీళ్ల పంపిణీ విషయంలో ఇది మంచి ముందడుగు అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు కూడా దీనివల్ల మేలు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.