- రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరిచ్చే దిశగా ముందడుగు
- కీలక ఒప్పందంతో మహారాష్ట్రతో వివాదాలకు చరమగీతం
సాక్షి, హైదరాబాద్: ఏటా వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు.. రాష్ట్రం లో కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నాలుగు దశాబ్దాల అంతర్రాష్ట్ర వివాదాలకు చరమగీతం పాడుతూ మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పం దం కుదుర్చుకుంది. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణలోని బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. పల్లెలు, పట్టణాల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. మేడిగడ్డ, తమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరాటా ప్రాజెక్టులతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు మరో 20లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఏర్పడనుంది. ఈ ఒప్పందాల ద్వారా మహారాష్ట్రలోని విదర్భ, గడ్చిరోలి జిల్లాల సాగు, తాగు అవసరాలు తీరనున్నాయి.
1975లో మొదలు: గోదావరి జలాల వినియోగానికి సంబంధించి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నాలుగు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. జలాలపై తొలుత 1975 జూలై 19న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం జలగం వెంగళరావు, అప్పటి మహారాష్ట్ర సీఎం ఎస్‌బీ చవాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాణహిత, లెండి, పెన్‌గంగ, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలు జరిగినా.. అవేవీ పరిష్కారం కాలేదు. 2012 మే 6న ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతకు తొలి ప్రాధాన్యమిస్తూ మహారాష్ట్రతో చర్చలు జరి పింది.
2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ నేరుగా చర్చలు జరిపారు. 2016 మార్చి 8న ప్రాజెక్టుల పూర్తికి సహకరించుకునేలా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఏకంగా 8 సార్లు మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం, సాగునీటి శాఖ మంత్రి గిరీశ్ మహాజన్‌లతో చర్చలకు జరిపి కీలక ఒప్పం దానికి బాటలు వేశారు.
మేడిగడ్డతో ఎంతో మేలు: కాళేశ్వరం ప్రాజెక్టు కింద 160 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించేందుకు మేడిగడ్డ బ్యారేజీని చేపట్టారు. దీనితో మహారాష్ట్రలో కొంత భూమి ముంపునకు గురవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 100 మీటర్ల ఎత్తుతో 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. దీంతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు నీరందనుంది. దీని అంచనా వ్యయం రూ.72 వేలకోట్లు. మరోవైపు మేడిగడ్డ ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో 45వేల ఎకరాలకు సాగు నీరందనుంది.
ఆదిలాబాద్‌కు ప్రాణం: ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. దీనికి 6,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీటితోపాటు తాగు అవసరాలు తీరనున్నాయి.
పెన్‌గంగతో 50వేల ఎకరాలు: పెన్‌గంగ నదిలో 5.12 టీఎంసీలను వాడుకునేందుకు తెలంగాణకు హక్కుంది. ఈ నీటితో ఆదిలాబాద్ జిల్లాలోని తాంప్సి, జైనథ్, బేల మండలాల్లోని 50 వేల ఎకరాలకు నీరందుతుంది. ఈ మేరకు తెలంగాణ భూభాగంలోని ఒడ్డులో మూడు బ్యారేజీలను నిర్మించనున్నారు. అందులో రాజాపేట, పిన్‌పహాడ్ వద్ద బ్యారేజీలను మహారాష్ట్ర నిర్మించనుండగా.. 0.85 టీఎంసీ సామర్థ్యం గల ఛనాఖా-కొరట బ్యారేజీని తెలంగాణ నిర్మించనుంది. దీనికి సుమారు రూ.650 కోట్ల అంచనా వ్యయంతో పనులు కూడా ప్రారంభమయ్యాయి.
‘కోటి’ ఆశలకు తొలి అడుగు
Published Wed, Aug 24 2016 2:39 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement