అందరూ యుద్ధం ప్రకటించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న చికెన్ గున్యా, డెంగ్యూ కేసుల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోమలపై పార్టీలకు అతీతంగా యుద్దం చేయాలని అన్నారు. ఒక యుద్ధానికి వెళ్లే సమయంలో ఎలాంటి సన్నాహాలు చేస్తామో అలాగే ప్రతి ఒక్కరు ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ దోమలను అరికట్టేందుకు నడుంకట్టాలని చెప్పారు. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమమంలో భారతీయులంతా ఏకమయ్యే తీరుగా ఢిల్లీలో ప్రమాదకరపరిస్థితులపట్ల ఏకమవ్వాలని తెలిపారు. గొంతు ఆపరేషన్ తర్వాత ఢిల్లీలో దోమల బెడద గురించి మాట్లాడిన ఆయన ప్రతి ఒక్క కుటుంబం కూడా చికెన్ గున్యా బారినపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దోమలకు కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్లు అనేది ఉండదని, అందరినీ అవి వెంబడిస్తాయని, కావున వాటిపై కలిసికట్టుగా యుద్ధం మాదిరి చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే తాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్కు దోమల నివారణకు కావాల్సిన ఫాగింగ్ మెషిన్లను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు అవి రెండు మూడు రోజుల్లో సమకూరుతాయని అన్నారు. 'ప్రభుత్వ సంస్థలు పనిచేయడం లేదని ఆరోపణలు చేస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవడం సరికాదు. ప్రతి ఒక్క ఢిల్లీ పౌరుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. అందరం కలిసిపనిచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది' అని కేజ్రీవాల్ అన్నారు.