
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తో జట్టు కట్టారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. 2014లో మోదీ తరఫున ప్రశాంత్ ప్రచార వ్యూహాలు సిద్ధంచేశారు. ప్రస్తుతం ప్రశాంత్ బిహార్‌లోని జనతా దళ్ (యూ) ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు.
కేజ్రీవాల్ శనివారం చేసిన ట్వీట్‌కు స్పందనగా ‘‘పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రత్యర్థిగా చూశామని, కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల కారణంగా కాంగ్రెస్‌ను విజయం వరించిందని’’ఐప్యాక్ మరో ట్వీట్ చేసింది. ‘‘పంజాబ్ ఎన్నికల ఫలితాల తరువాత మిమ్మల్ని (కేజ్రీవాల్) మేము ఎదుర్కొన్న బలమైన ప్రత్యర్థిగా గుర్తించాం. ఇప్పుడు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలపడం సంతోషాన్నిస్తోంది’’అని తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీపార్టీలతో ముక్కోణపు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.