ప్రతాకాత్మక చిత్రం
మలప్పురం : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళ ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. గత రెండు రోజులుగా మలప్పురం, వయనాడ్ జిల్లాల ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ ఘటన ప్రకృతి విలయ తాండవానికి కేరళ నిలయంగా మారిందనడానికి సాక్ష్యంగా నిలిచింది. వర్షం కురుస్తుండటంతో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని తల్లితో పాటు నడుస్తున్నాడు. ఒక్కసారిగా ఆ పరిసరాల్లో ఏదో అలజడి మొదలైంది.
ప్రమాదమేదో ముంచుకొస్తోందని గ్రహించిన ఆ తల్లీకొడుకు ముందుకు పరుగెత్తే యత్నం చేశారు. ఉన్నట్టుండి భారీగా మట్టిపెళ్లల ప్రవాహం వారిని ముంచెత్తేందుకు దూసుకొచ్చింది. కొడుకు క్షణాల్లో అక్కడికి సమీపంలో ఉన్న ఓ భవనం వద్దకు చేరగా.. అతని తల్లి మాత్రం మట్టిపెళ్లల కింద కూరుకుపోయింది. వస్తూవస్తూ ఆ ప్రవాహం వారి ఇళ్లును కూడా కప్పెట్టేసింది. ఆ సమయంలో అతని భార్య, ఏడాదిన్నర కొడుకు కూడా ఇంట్లోనే ఉండటంతో మట్టిలో కూరుకుపోయినట్టు తెలిసింది. దీంతో బాధితుడు కొట్టక్కున్ను జనమైత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయక చర్యలు మొదలు పెట్టారు.
శుక్రవారం రాత్రి వరకు గాలించినా అతని భార్య, కుమారుడు, కొడుకు జాడ కానరాలేదు. భారీ స్థాయిలో మట్టిపెళ్లలు, చెట్లు పైనబడటంతో వారు బతికే అవకాశాలు లేవని డిప్యూటీ ఎస్పీ వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఇక గత మూడు రోజులుగా వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలువిడిచారు. ఒక్క మలప్పురం జిల్లాలోనే 9 మరణాలు సంభవించాయి. ఇక ఇదే జిల్లాలోని నీలంబూర్‌లో కొండ చరియలు విరిగిపడటంతో భూథతాన్-ముథప్పాన్ పర్వతాల కింద 40 మందికి చిక్కుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment