కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడున్న తెలుగు వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొచ్చిలోని ఏలూరు కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వెయ్యి, పదిహేను వందల మంది ఇక్కడున్న ఫ్యాక్ట్ కంపెనీలో, షిప్‌యార్డుల్లో పని చేస్తున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.తెలుగువారికి చెందిన 20,25 ఇళ్లలో పదహారు ఇళ్లు వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ఆఇళ్లలో సామాన్లు ఏవీ పనికిరాకుండా పోయాయి.కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో ఉన్న వీరు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే, ఇళ్లలో రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేకపోవడంతో రోజు గడపడమే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు.
కొచ్చి తెలుగు అసోసియేషన్ వీరిని ఆదుకోవడానికి విరాళాల సేకరణ వంటి చర్యలు చేపడుతోంది.ఇక్కడి తెలుగు వారిలో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. వర్షాల వల్ల ఒక్కో తెలుగు కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత హనుమంతు నాయక్ చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ ఇక్కడి ఫ్యాక్ట్ కంపెనీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment