
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో తమ రాష్ట్రంలో త్వరలోనే మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా మంత్రి టీపీ రామకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బేవరేజ్ కార్పొరేషన్, కేరళ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలోని 301 లిక్కర్ షాపులు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలు వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల సమయంలో సామాజిక ఎడబాటు నిబంధనకు విఘాతం కలిగే అవకాశం ఉన్న తరుణంలో... వెబ్‌పోర్టల్స్ ద్వారా బుకింగ్‌లు చేపట్టి.. టేక్ అవే ద్వారా మద్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. (మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చిన ‘మహా’ సర్కారు)
అదే విధంగా బార్లు, హోటళ్లలో కూడా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తున్నామని.. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంటుందని రామకృష్ణన్ స్పష్టం చేశారు. కేవలం పార్శిల్ కౌంటర్ల వద్దనే వినియోగదారులు చెల్లింపులు జరిపి.. మద్యం తీసుకువెళ్లాలని సూచించారు. కాగా మద్యం అమ్మకాలపై పన్ను పెంచుతూ కేరళ కేబినెట్ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. బీర్, వైన్ అమ్మకాలపై 10 శాతం, ఇతర మద్యం ఉత్పత్తులపై 35 శాతం టాక్స్ పెంచింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో.. ఆదాయ మార్గాన్వేషణలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. (ఆన్‌లైన్‌లో మద్యం విక్రయంపై ఆలోచించండి)
Comments
Please login to add a commentAdd a comment