తిరువనంతపురం : కేరళలోని ఓ పాఠశాల్లో 16 ఏళ్ల విద్యార్థి ఓ అమ్మాయిని హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఐదు నెలల క్రితం జరగగా.. కొడుకు జీవితం కోసం ఆ తండ్రి ఉద్యోగం మానేసి మరీ కోర్టుల చుట్టు తిరిగాడు. తిరువనంతపురంలోని సెయింట్ థామస్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి 11వ క్లాస్‌కు చెందిన అమ్మాయిని కౌగిలించుకొని, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని సస్పెండ్ చేయడంతో పాటు బోర్డు పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించింది.
తన కొడుకు జీవితం పాడవుతుందని భావించిన ఆ విద్యార్థి తండ్రి స్కూల్ సస్పెన్షన్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ గత ఆగస్టులో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా కోర్టు ఆ సస్పెన్షన్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ.. . విద్యార్థుల క్రమశిక్షణ విషయం పాఠశాల ప్రతిష్టపై ఆధారపడి ఉంటుందే కానీ, పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అవసరమైతే విద్యార్థుల తల్లితండ్రులకు జరిమానా సూచిస్తూ తీర్పునిచ్చింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించే అంశం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది.
‘ఈ విషయంలో క్షమాపణ చెప్పినప్పటికీ నన్ను ఓ రేపిస్టు అని పిలుస్తున్నారు. పరీక్షలు రాయకుంటే ఒక ఏడాది వృథా అవుతుంది. అది నేను ఊహించలేను. నాకు బోర్డు పరీక్షలు రాయలనుంద’ని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకునే హక్కు రాజ్యంగం కల్పించిందని, తన కుమారుడి వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తూ పాఠశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుందని విద్యార్థి తండ్రి వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment