యువతులను కాపాడి.. హీరో అయ్యాడు | Ketan Jorawadia saves girls in deadly Surat coaching center fire | Sakshi
Sakshi News home page

యువతులను కాపాడి.. హీరో అయ్యాడు

Published Sat, May 25 2019 12:28 PM | Last Updated on Sun, May 26 2019 1:23 PM

Ketan Jorawadia saves girls in deadly Surat coaching center fire - Sakshi

సూరత్‌ : గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద సమయంలో.. ప్రాణాలను పణంగా పెట్టి యువతులను కాపాడిన ఓ వ్యక్తిని రియల్‌ హీరో అంటూ సామాజిక మాధ్యమాల్లో కీర్తిస్తున్నారు. కోచింగ్‌ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 22 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాద సమయంలో కేతన్‌ జొరవాడియా అనే యువకుడు చూపించిన తెగువకు నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


సూరత్‌లో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్న సమయంలో చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్‌ జొరవాడియా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్‌ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ  కేతన్‌ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా కేతన్‌ చూపించిన తెగువను మెచ్చుకున్న వారిలో ఉన్నారు.


తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్‌ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్‌ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్‌ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు. 

విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్‌ బుటానిని అరెస్ట్‌ చేశామని ఏసీపీ పీఎల్‌ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్‌ వెకరియా, జిగ్నేశ్‌ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement