నయా క్రేజ్‌.. కికీ చాలెంజ్‌..! | Kiki dance dare keeps police on their toes | Sakshi
Sakshi News home page

నయా క్రేజ్‌.. కికీ చాలెంజ్‌..!

Published Wed, Aug 1 2018 3:59 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Kiki dance dare keeps police on their toes - Sakshi

కికీ చాలెంజ్‌ వీడియో దృశ్యాలు (ఫైల్‌)

న్యూఢిల్లీ: ఇదో కొత్త తరహా చాలెంజ్‌.. యువతను నడి రోడ్లపై నాట్యం చేయిస్తున్న  సరికొత్త సోషల్‌ మీడియా సవాల్‌.. ఇదే కికీ డ్యాన్స్‌ చాలెంజ్‌. కదిలే వాహనంలో నుంచి కిందకు దూకి, ఆ వాహనంతో పాటే సమాంతరంగా లయబద్ధంగా కదులుతూ.. కెనడా ర్యాప్‌ స్టార్‌ డ్రేక్‌ పాడిన ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ పాటకు నాట్యం చేయడమే ఈ చాలెంజ్‌. ఈ సవాలును స్వీకరించినవారు ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా సైట్లలో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ డ్యాన్స్‌ సవాల్‌ ఇప్పుడు దేశవిదేశాల్లో యువతను ఉర్రూతలూగిస్తోంది.

సాధారణ యువతరం మొదలుకొని సెలబ్రిటీస్‌ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. విల్‌ స్మిత్, సియారా లాంటి ప్రముఖులూ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే, ఈ డ్యాన్స్‌ ఫీట్‌ ప్రమాదకరమైనదని, దీని జోలికి వెళ్లవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెరచి ఉన్న అంబులెన్స్‌ డోర్‌ పక్కగా ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్‌ చేశారు. ‘రోడ్లపై నాట్యం చేస్తే మీ కోసం మరో ద్వారాలు తెరుచుకుంటాయి’ అనే హెచ్చరిక ఆ ట్వీట్‌ లో ఉంటుంది.  

ప్రమాదాలతో డ్యాన్స్‌
ఈ కికీ చాలెంజ్‌ మైకంలో పడి చాలా మంది ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కారు దిగే సమయంలో జారిపడి గాయపడుతున్న వారు కొందరైతే, నడుస్తున్న కారు పక్కనే డాన్స్‌ చేస్తూ, కారు తనని దాటిపోకుండా ఓ పక్క జాగ్రత్త పడుతూ చేసే ఈ నృత్యం మత్తులో పడి ఎదురుగా ఏముందో కూడా చూసుకోకుండా ఎదురొస్తున్న వాహనాలు, లేదా రోడ్డు పక్కనున్న స్తంభాలకు గుద్దుకొని, లేదా రోడ్లపైనున్న గుంతల్లో పడి గాయాల పాలవుతున్నవారు మరికొందరు.

అసలెక్కడిదీ చాలెంజ్‌: కికీ చాలెంజ్‌ అనే ఈ ఇంటర్‌నెట్‌ సంచలనానికి మరో పేరు ‘ ఇన్‌ మై ఫీలింగ్స్‌’. డ్రేక్‌ గ్రాహం అనే 24 ఏళ్ల కెనడియన్‌ యువ గాయకుడు ఇటీవల విడుదలైన తన ‘స్కార్పియన్‌’ ఆల్బంలోని ‘ఇన్‌మై ఫీలింగ్స్‌’ అనే పాటలో ‘కికీ డూ యూ లవ్‌ మీ’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ పాటకీ, ‘కికీ చాలెంజ్‌’కీ ఏ సంబంధమూ లేదు. అయితే ఇంటర్‌నెట్‌ కమెడియన్‌ షిగ్గీ ఈ పాటకు డాన్స్‌ చేసి దాన్ని ఇన్‌ స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడంతో వేలాది మంది అనుసరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు
అత్యంత ప్రమాదకరమైన ఈ నృత్యంపై యిప్పుడు ఇండియా, అమెరికా, స్పెయిన్,  మలేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆంక్షలు విధించారు. ప్రమాదకరమైన ఈ కారు నృత్యాన్ని అనుకరించొద్దంటూ ముంబై, చండీగఢ్, లక్నోలాంటి నగరాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కికీ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న వారి ని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. స్పెయిన్‌ పోలీసులు ఈ నృత్యం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఫ్లోరిడాలో దీన్ని నేరంగా భావించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement