కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు | Kohi noor was given as a gift | Sakshi
Sakshi News home page

కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు

Published Tue, Apr 19 2016 2:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు - Sakshi

కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు

వజ్రాన్ని తిరిగి తీసుకురాలేమని కేంద్రం సంకేతం
♦ ఆనాటి పంజాబ్ పాలకులు బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చారు
♦ అది కావాలంటే.. మన దగ్గరున్న విదేశీ చారిత్రక సంపదను తిరిగి ఇవ్వాల్సి రావొచ్చన్న సాంస్కృతిక శాఖ
♦ వజ్రాన్ని తీసుకురావాలన్న పిటిషన్‌ను కొట్టేయలేమన్న సుప్రీం
 
 న్యూఢిల్లీ:  ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని యునెటైడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) నుంచి భారత్‌కు తిరిగి తీసుకురావాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) కొట్టివేయటానికి సుముఖంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా చేస్తే కోహినూర్ వజ్రంపై భారతదేశపు న్యాయమైన హక్కును బ్రిటన్ నిరాకరించటానికి దారితీయొచ్చని, భవిష్యత్తులో దాన్ని వెనక్కితెచ్చే ప్రయత్నాలకు అవరోధంగా మారే అవకాశముందని పేర్కొంది. కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు పిల్ వేయడం తెలిసిందే. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. స్పందన తెలపాల్సిందిగా ఇంతకుముందే కేంద్రాన్ని ఆదేశించింది.

తాజాగా సోమవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వివరణ ఇచ్చారు. ‘‘కోహినూర్ బలవంతంగా తీసుకెళ్లారనో, దొంగతనానికి గురైందనో చెప్పలేం. సిక్కు యుద్ధాల్లో తమకు సహకరించినందుకు 1849లో మహరాజా రంజిత్‌సింగ్ వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ వజ్రాన్ని ఇచ్చారు. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని పార్లమెంటులోనూ, బయటా చాలా సార్లు డిమాండ్లు వచ్చాయి. కానీ కోహినూర్ లాంటి సంపదను వెనక్కివ్వాలని మనం కోరితే.. మన దేశంలోని మ్యూజియాల్లో ఉన్న విదేశీ చారిత్రక సంపద, కళాఖండాలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు కోరతాయి.

అప్పుడు మన మ్యూజియాల్లో ఏమీ మిగలవు’’ అని చెప్పారు. తద్వారా ఆ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని సంకేతాలిచ్చారు. దీనిపై ధర్మాసనం పై విధంగా స్పందించింది. తాము ఈ పిల్‌ను కొట్టివేసినట్లయితే.. భవిష్యత్తులో భారత్ ఆ వజ్రాన్ని అడిగినప్పుడు ‘మీ సుప్రీంకోర్టు పిల్‌ను కొట్టివేసింది’ అన్న కారణం చూపుతూ నిరాకరించేందుకు అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఈ అంశంలో విదేశాంగశాఖ ఇంకా తన అభిప్రాయాన్ని, వివరణను సమర్పించాల్సి ఉండటంతో.. కోహినూర్‌పై హక్కు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్దేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. కోహినూర్‌ను వెనక్కి తీసుకొచ్చే అంశంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టబోదని ఆ శాఖ మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు. అది దౌత్యపరమైన అంశమని.. దానిపై కేంద్ర, విదేశాంగశాఖలు నిర్ణయం తీసుకుంటాయన్నారు.
 
 గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ..!
 ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. వంద శాతం స్వచ్ఛత గల ఈ వజ్రం బరువు 108 క్యారెట్లు. దీని విలువ రూ.6,600 కోట్ల పైమాటేనని అంచనా. అసలు కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి శిఖరం’ అని అర్థం. 14వ శతాబ్దంలో గుంటూరు సమీపంలో ఈ వజ్రం దొరికినట్లు ప్రచారంలో ఉంది. అప్పట్లో ఏకంగా 793 క్యారెట్ల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం అది. ఔరంగజేబు హయాంలో దానికి మెరుగుపెట్టించే ప్రయత్నంలో.. 186 క్యారట్లకు తగ్గిపోయింది. బ్రిటిషర్ల వద్ద మరింత చిక్కిపోయింది. తొలుత కాకతీయుల చేతిలో ఉన్న ఈ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది.

మొఘలుల చేతిలో నుంచి నాదిర్‌షా దండయాత్ర సమయంలో పర్షియాకు మారింది. అనంతరం క్రమంగా పంజాబ్ పాలకుడు మహరాజా రంజిత్‌సింగ్ వద్దకు చేరింది. సిక్కు యుద్ధాల సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రంజిత్‌సింగ్ వారసులకు సహాయపడడంతో.. వారు బ్రిటిష్ వారికి అప్పగించారు. అలా ఆ వజ్రం చివరికి బ్రిటన్ మహారాణి కిరీటంలోకి చేరింది. ఈ వజ్రం తమదంటే తమదని భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం పురుషులెవరికీ కలసి రాదనే నమ్మకం ఉంది. బ్రిటిష్ రాచకుటుంబంలోనూ ఆ నమ్మకం కొనసాగి.. క్వీన్ విక్టోరియా కిరీటంలో భాగమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement