మతతత్వ శక్తులను తరిమికొడతానని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ హెచ్చరించారు.
మతతత్వ శక్తులను తరిమికొడతానని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. దాణా కుంభకోణం కేసులో రెండున్నర నెలల కిందట జైలు పాలైన ఆయన, సోమవారం బెయిలుపై విడుదలయ్యారు. రాంచీలోని బిర్సాముండా జైలు నుంచి బయటకు వస్తూనే మతతత్వ శక్తులపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అధికారం కోసం నరేంద్ర మోడీ, బీజేపీ, ఆరెస్సెస్‌లు కంటున్న కలలను సాకారం కానివ్వబోమని అన్నారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ, ‘మతతత్వ శక్తులు ఢిల్లీపై పట్టు బిగించాలని కోరుకుంటున్నాయి. నేను బయటకు వచ్చాను. వాటిని తరిమికొడతాను. లౌకిక శక్తుల బలోపేతానికి దేశమంతటా పర్యటిస్తాను’ అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ‘నరేంద్ర మోడీ కానీ, మరే మోడీ అయినా కానీ... ఇప్పుడు నేను బయటకు వచ్చా... నేను రెడీ’ అని వ్యాఖ్యానించారు.
‘జబ్ తక్ రహేగా ఆలూ...’: జైలు నుంచి విడుదలైన తర్వాత తామార్‌లోని దేవరీ ఆలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లినపుడు నా పని అయిపోయిందని కొందరు అనుకున్నారు. కానీ వాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. జబ్ తక్ రహేగా ఆలూ.. తబ్ తక్ రహేగా లాలూ (బంగాళదుంపలు ఉన్నంత వరకు లాలూ ఉంటాడు)’ అని వ్యాఖ్యానించారు.