రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు.
అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు.
ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment