
లాలూ గుండెకు శస్త్రచికిత్స
ముంబై: గుండె వ్యాధితో బాధ పడుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇక్కడి ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో బుధవారం శస్త్రచికిత్స పూర్తయింది. 20 మంది వైద్యులు ఆరు గంటలకుపైగా కష్టపడి దీన్ని పూర్తి చేశారు. కుంచించుకుపోయిన ఏవీఆర్ అవోర్టిక్(బృహద్ధమని) కవాటం మార్చడం, ధమని లోపాలు తొలగించడం, గుండెలో 3 మిల్లీమీటర్ల రంధ్రం పూరించడం ఈ శస్త్రచికిత్సలో భాగంగా పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, మూడు రోజులు ఐసీయూలో ఉంచుతామని తెలిపారు.
శనివారం ఆస్పత్రిలో చేరిన 66 ఏళ్ల లాలూకు పలు పరీక్షలు చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చామని సర్జరీకి నేతృత్వం వహించిన డా. రమాకాంత పాండా తెలిపారు. ఈయనే ఐదేళ్ల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శస్త్రచికిత్స చేశారు. లాలూ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ‘లాలూజీ తొందరగా కోలుకోవాలి, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, లాలూ అభిమానులు పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన త్వరగా కోలుకోవాలని హోమాలు నిర్వహించారు.