‘ఢిల్లీకి పిలిపించి షా షాకిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన తొలివ్యక్తి రాజీవ్ ప్రతాప్ రూడీ. రాజీనామా అనంతరం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా నిర్ణయం తాను తీసుకోలేదని, బీజేపీ అధిష్టానం చెప్పిన మేరకు పదవిని వదులుకున్నానని స్పష్టం చేశారు. దాంతోపాటుగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ మాజీ మంత్రి వెల్లడించారు. గురువారం రోజు ఇండిగో విమానంలో భార్యతో సహా న్యూఢిల్లీ నుంచి బిహార్ రాజధాని పాట్నాకు వెళ్లారు.
అక్కడ ఎయిర్ పోర్టులో తన సెల్ ఫోన్ స్విచ్ఛాన్ చేయగానే కొన్ని సందేశాలు వచ్చినట్లు చెప్పారు. అమిత్ షా తనను కలవాలని చెప్పినట్లు ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చినట్లు తెలిపారు. భార్యను ఇంటికి వెళ్లమని చెప్పిన తాను.. పాట్నాకు వచ్చిన ఇండిగో విమానంలోనే తిరిగి ఢిల్లీ వెళ్లి షాను కలవగా ఆయన చెప్పిన విషయం తనను షాక్ కు గురిచేసిందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలు తనకు అప్పగించనున్నారని, ప్రస్తుతం మంత్రి పదవికి రాజీనామా చేయాలని షా సూచించగా ఆ పని చేసినట్లు రూడీ వివరించారు. తాజా కేబినెట్ విస్తరణలో 9 మంది కొత్తవారికి చాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.