ఫైల్‌ఫోటో
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయికి చేరుకుంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి కేంద్ర నిధులపై బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వరుస ట్వీట్లలో దీటుగా బదులిచ్చారు. కేంద్రం నుంచి నిధులను పొందే హక్కు రాష్ట్రాలకు ఉందని, ఇది యూపీఏ లేదా ఎన్‌డీఏ బహుమతి కాదని, 1950 నుంచి ఈ ఒరవడి కొనసాగుతోందని సిద్ధరామయ్య బదులిచ్చారు.
అమిత్ షా వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాను 5 బడ్జెట్లు ప్రవేశపెట్టానని.. వీటికి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సొంత వనరులు, అప్పులు ద్వారా నిధులు సమీకరించామని చెప్పారు. ఈ నిధులు ఏమయ్యాయన్న అమిత్ షా ప్రశ్నకూ సిద్ధూ వివరణ ఇచ్చారు. నీటిపారుదల, విద్యా, వైద్యం, రుణ మాఫీ, పంటల బీమా వంటి పలు ప్రజోపయోగ పథకాలపై వీటిని వెచ్చించామని చెప్పారు. బడ్జెట్‌లను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి విపక్ష బీజేపీ సభ్యుల ఆమోదం కూడా పొందామని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అమిత్ షా తీరును సీఎం ఆక్షేపించారు. కాగా, మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment