అమిత్ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర విమర్శలు చేశారు. 'కర్ణాటకలో సిద్దరామయ్య అంటే అవినీతి అలాగే అవినీతి అంటే సిద్దరామయ్య అని అర్థం' అని వ్యాఖ్యానించారు. మైసూరులో గురువారం జరిగిన పార్టీ పరివర్తన యాత్ర కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించాలని కోరారు. 'నేను కర్ణాటక ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఆపాలి' అని అమిత్‌షా సిద్దరామయ్యకు సవాల్ విసిరారు.
పరివర్తన ర్యాలీ అంటే యువత జీవితాల్లో మార్పు అని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడం అని చెప్పారు. పలు వ్యూహాలతో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజలు మాత్రం మారాలని కోరారు. 'బీజేపీ నిర్వహిస్తున్న పరివర్తన యాత్ర చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న ర్యాలీని అడ్డుకోవాలని చూస్తోంది.. బంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా వ్యతిరేకించింది. కానీ ఆ బిల్లు ముస్లింలకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చాం. ముస్లిం సోదర, సోదరీమణులకు న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము' అని అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment