ఎర్రకోటకు పోటెత్తిన యువతరం
ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న విద్యార్థులు
న్యూఢిల్లీ: నగరంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థిలోకం శుక్రవారం ఎర్రకోటకు తరలింది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు తామంతా ఎర్రకోటకు వచ్చినట్లు ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, ఐపీ యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తున్న సందర్భంలో విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది.
తమ కరతాళ ధ్వనులతో స్వాతంత్య్రోత్సవ సంబరాలను మార్మోగించారు. జై జవాన్, జైకిసాన్ అంటూ దేశానికి వెన్నెముక అయిన రైతును, కంటికి రెప్పలా కాపాడుతున్న జవానును స్మరించుకున్నారు. పతావిష్కరణ తర్వాత మోడీ ప్రసంగాన్ని ఆసాంత ఆసక్తిగా విన్నారు. ప్రసంగంలో మోడీ చమక్కులకు అనుగుణంగా విద్యార్థుల నుంచి స్పందన కనిపించింది. దేశభక్తి ఉప్పొంగేలా మోడీ ప్రసంగించారంటూ కొనియాడారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల జాకీర్ హుసేన్ కాలేజీలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసిస్తున్న కృష్ణన్ ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...
‘నా స్నేహితులు పదిమందితో కలిసి ఇక్కడికి వచ్చాను. మోడీ ప్రసంగం అద్భుతంగా అనిపించింది. సాధారణ జనాన్ని కూడా అనుమతిస్తున్నారని తెలియగానే మోడీ ప్రసంగం వినాలని నిర్ణయించుకున్నాం. మేము మాత్రమే కాకుండా మా కాలేజీకి చెందిన వందల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర సంబరాలను చూస్తుంటే గర్వంగా అనిపించింది. పతాకావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నప్పుడు వేలాది మంది నిల్చోవడం దేశ ప్రజలు మోడీకి ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా అనిపించింద’న్నాడు.
అదే కళాశాలకు చెందిన జర్నలిజం విద్యార్థి రుక్సానా మాట్లాడుతూ... ‘గతంలో స్వాతంత్య్రోత్సవాలను తిలకించేందుకు ఎర్రకోట వద్దకు ఎప్పుడూ రాలేదు. యువతకు ఆరాధ్యుడైన మోడీ ఇక్కడ జాతినుద్దేశించి చేసే ప్రసంగాన్ని వినేందుకే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. ఆయనతో మాట్లాడాలని, చూడాలని భావించాను. అయితే మాట్లాడలేకపోయినా ఎర్రతివాచీపై మోడీ నడుచుకుంటూ వస్తుండడం చూశాను. ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. అద్భుతంగా అనిపించింద’ని సంబరపడింది. ఇలా వేలాదిమంది విద్యార్థులు మోడీ ప్రసంగం పూర్తయ్యేవరకు ఎర్రకోట వద్దే గడిపారు. ఆ తర్వాత కూడా వారంతా మోడీ గురించి మాట్లాడుకోవడమే కనిపించింది.