న్యూఢిల్లీ: శాంతిభద్రతలనేవి రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, ప్రతీది ప్రధాని కార్యాలయానికి చెప్పాల్సిన అవసరం లేదని జమ్మూకశ్మీర్లోని అధికార పార్టీ పీడీపీ పేర్కొంది. ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హుర్రియత్ నేత మసరత్ అలాం విడుదలపై అధికార పీడీపీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో వివరణ ఇస్తూ అలాంను పీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు.
జమ్మూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం దేశానికి వ్యతిరేకమైన నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుబట్టడంతో ప్రధాని ఈ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత తమకు ముఖ్యమని దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన పీడీపీ ప్రధాని వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. జమ్మూకశ్మీర్లో బీజేపీ-పీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.