న్యూఢిల్లీ: భవిష్యత్తులో కొత్త చట్టాలు చేసే ముందు అవి కోర్టు కేసులకు దారితీస్తాయా లేదా అన్నదానిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉండొచ్చు. అలాగే కొత్త చట్టాలు, ప్రస్తుత చట్టాలకు సవరణల వల్ల కేసుల సంఖ్య పెరగకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి రూపొందించిన కొత్త నోట్‌లో ఈ ప్రతిపాదనలను చేర్చినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చట్టాలకు సంబంధించి పెరిగిపోతున్న వివాదాలను కోర్టుల ఆవల పరిష్కరించేలా ప్రతిపాదిత బిల్లుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే భవిష్యత్తులో ప్రవేశపెట్టే ప్రతి బిల్లులో ‘లిటిగేషన్ అసెస్‌మెంట్’ నిబంధన చేర్చాలి. బిల్లు చట్టరూపం దాల్చితే అది వివాదాస్పదమవుతుందా అనే విషయాన్ని కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ వివరించాలి.