
వ్యవసాయ చట్టాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు కంగనా ఓ వీడియో విడుదల చేశారు.
‘నా వ్యాఖ్యలు చాలా మందిని నిరాశకు గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత’’ అని కంగనా పేర్కొన్నారు.

Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2
— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024
కాగా మండి ఎంపీ కంగనా రనౌత్.. రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు రైతులే స్వయంగా డిమాండ్ చేయాలని కోరారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.
ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నా’ కంగనా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కంగన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.