ఉన్నవాడికి చుట్టాలు... పేదవానికి కష్టాలు! | Sakshi Guest Column On New criminal laws | Sakshi
Sakshi News home page

ఉన్నవాడికి చుట్టాలు... పేదవానికి కష్టాలు!

Published Fri, Aug 9 2024 12:32 AM | Last Updated on Fri, Aug 9 2024 12:32 AM

Sakshi Guest Column On New criminal laws

అభిప్రాయం

ఇవీ మన కొత్త చట్టాలు–3

కొత్త నేర చట్టాలను అనుసరించి మొత్తం 90 రోజులు నిందితులను కస్టడీలో పెట్టవచ్చు. పోలీసు కస్టడీ, కోర్ట్‌ కస్టడీల పేరుతో లాకప్‌లో లేదా జైళ్లలో బంధించేందుకు పోలీస్, న్యాయ వ్యవస్థలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టాలు సాధారణ పౌరుల పాలిట శాపాలే అనడం అతిశయోక్తి కాదు. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సకల అధికారాలనూ కట్టబెడుతున్న ఈ చట్టాల వల్ల... ధనవంతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. 

వారు లంచాలు ఇవ్వగలుగుతారు. ఖరీదైన లాయర్లను నియమించుకొని బెయిల్‌ పొందగలుగుతారు. ష్యూరిటీలు ఇవ్వగలుగుతారు. కొత్త చట్టాల పుణ్యమా అని రాజకీయనాయకుల ప్రమేయం, డబ్బులు... పోలీస్‌ కేసుల వ్యవహారంలో మునుపటి కన్నా ఎక్కువ ప్రాము ఖ్యాన్ని సంతరించుకుంటాయి.  

ఒక వ్యక్తి నేరం చేశాడనే అభియోగంతో అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తీరికగా  నేర ఆరోపణ చేసి కోర్టుకు పంపిస్తారు. ఆరోపణలపై విచారణకు ఎన్నేళ్లయినా పట్ట వచ్చు. చివరికి ఆరోపించిన నేరం రుజువు కాకపోవచ్చు. అప్పటివరకూ జైల్లో ఉన్న ఆ పౌరుని స్వేచ్ఛ ఖరీదెంత అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక వేళ నేరస్థుడు అని కోర్టు తీర్పు ఇస్తే ఇక అప్పీళ్లలో గెలవడం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. వకీళ్లకు సంబంధించిన డబ్బు, లంచగాళ్లను మేపడానికి చెల్లించడాలు ఉండనే ఉంటాయి. 

పాత క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌తో పోల్చితే  కొత్త చట్టాలు (భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత 2023) ప్రమాదకరమైనవి. పాత క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌– 1973 కింద ‘అత్యధికంలో అధికం’ 15 రోజులకు మించి ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇది పార్లమెంట్‌ చేసిన చట్టం కాదు. అంతకుముందు రాజ్యాంగ నిర్ణాయక సభ 1950లోనే నిర్ణయించిన విషయం. రాజ్యాంగం మూడో భాగంలో అతి కీలకమైన పౌరుని ప్రాథమిక హక్కుల గురించిన వివరాలు ఉన్నాయి. 

ఇందులో 21వ ఆర్టికల్‌ జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛల ప్రాముఖ్యాన్ని చెబితే... 22వ ఆర్టికల్‌ అరెస్ట్, డిటెన్షన్‌లకు సంబంధించిన వివరాలను పేర్కొంటోంది. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల లోపే కోర్టు ముందు కచ్చితంగా హాజరు పరచాలని ఈ ఆర్టికల్‌ చెబుతోంది. 

ఈ రాజ్యాంగ నిబంధనలను అనుసరించి చేసిన చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇలా 24 గంటలని ప్రత్యే కంగా పేర్కొనడానికి కారణం... పోలీసుల కస్టడీలో దర్యాప్తు (ఇన్వెస్టి గేషన్‌)కు ఒక్క 24 గంటలు చాలని భావించడమే! సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను గమనిస్తే ఇదే సంగతి బోధపడుతుంది.

అయితే 24 గంటలకు మించి కస్టడీలో ఉంచుకోవడానికి పోలీసులు  రకరకాల కారణాలు చెప్పడానికీ, ఏ కారణాలూ ఇవ్వకుండానే అరెస్టు చేసి కస్టడీ చేసేందుకూ పోలీసులకు ఈ నేర చట్టాలు విపరీతమైన అధికా రాలను ఇస్తున్నాయి. సింపుల్‌గా ‘తరువాత చూద్దాంలే, ముందు కస్టడీలో పడేయండి’ అనే అధికారం ఇస్తున్నాయి. 

ఎంపీలు, డబ్బున్నవారు, ఎమ్మె ల్యేలు, మంత్రుల పలుకుబడి ఉన్నవారు ఈ కస్టడీల నుంచి బయట పడిపోగలుగుతారు. కానీ కనీసం జరిమానా కూడా కట్టలేక, బెయిల్‌ కండిషన్ల కింద డబ్బు చెల్లించలేక ఎంతోమంది పేద, మధ్యతరగతి పౌరులు జైలు పాలు అయ్యేవారే అధికం అని ఈ చట్ట నిబంధనల వల్ల అర్థమవుతుంది.

భారతీయ సురక్ష సంహిత కింద 15 రోజుల నుంచి, విడి విడిగా 40 రోజులు, 60 రోజుల దాకా; ఇంకా కొన్ని కేసుల్లో 90 రోజులూ జ్యుడిషియల్‌ కస్టడీ (అంటే కోర్టు సమీక్షించే కస్టడీ) పెంచడానికి చట్టాన్ని తయారు చేశారు.  

పోలీసు కస్టడీ అయితే ఇంకా మరీ ఇబ్బందికరమైనది. పోలీసులు కస్టడీలో ఉంచే కాలం 15 రోజుల నుంచి 60 రోజుల దాకా పెరుగుతుంది. మొదట 15 రోజుల దాకా కస్టడీలో పడే స్తారు. దర్యాప్తు చేయడానికి సమయం చాలలేదని... కస్టడీ సమయాన్ని పొడిగించమని కోరితే సురక్ష సంహిత నియమాల ప్రకారం మరో 15 రోజులు కస్టడీకి పంపుతారు. ఇలా 60 రోజుల దాకా కస్టడీలో ఉంచే అవకాశాన్ని కొత్త చట్టాలు ఇస్తున్నాయి. 10 ఏళ్ల జైలు శిక్ష విధించగలిగిన సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేస్తే 40 రోజుల దాకా పోలీసులు కస్టడీలో పెట్టుకునే అధికారం పోలీసులకు దఖలుపడుతోంది. 

పోలీసులకు అపరిమిత అధికారాలు ఇచ్చి, పౌర హక్కులకు భంగం కలిగే అవకాశాన్ని కొత్తచట్టాలు ఇస్తున్నాయనేది మొత్తంగా మనం అర్థం చేసుకోవలసిన అంశం.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్‌ ఆఫ్‌ లా’లో ప్రొఫెసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement