
ఏ చర్చకైనా సిద్ధమే: వెంకయ్య నాయుడు
అన్ని పార్టీల సహకారానికి అఖిలపక్ష భేటీలో వెంకయ్య పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సగటు మనిషికి అవసరమైన అన్ని అంశాలపై తగిన విధంగా చర్చ జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీల నేతల సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తమిళనాడుకు చెందిన మత్స్యకారుల సమస్యలు, నదుల అనుసంధానం, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల రిజర్వేషన్ బిల్లు, రైల్వే చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మహిళలపై దాడులు, ఆంధ్రప్రదేశ్ విభజన తదితర అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. జేడీఎస్ నేత దేవెగౌడ, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వైఎస్సార్‌సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి దేవేందర్‌గౌడ్, నరసింహం, టీఆర్‌ఎస్ నుంచి కేకే, ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కూడా హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని మోడీ వివిధ పార్టీల నేతలతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు.
యూపీఏ నిర్వాకం వల్లే ధరల పెరుగుదల..
దేశంలో విపరీతంగా పెరుగుతున్న ధరలకు గత యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణం కావొచ్చని వెంకయ్యనాయుడు అన్నారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లోక్‌సభ స్పీకర్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... పార్టీలకు అతీతమైన స్పీకర్‌పై ఆరోపణలు చేయడం దురదృష్టమన్నారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తాం: అరుణ్ జైట్లీ
చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ.. ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఆహారోత్పత్తుల నిల్వలు సరిపోను ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూపీఏ విధానాల వల్లనే ధరలు విజృంభించాయన్నారు.