రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్!
ఉప నేతగా ఆనంద్‌శర్మల ఎంపిక
పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వివేది వెల్లడి
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత కావడం లాంఛనమే. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆజాద్ ఎంపిక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఆదివారమిక్కడ ప్రకటించారు. యూపీఏ-2 హయాంలో మంత్రిగా పనిచేసిన ఆనంద్‌శర్మ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉప నేతగా నియమితులైనట్టు తెలిపారు. ఆజాద్, ఆనంద్‌శర్మలిద్దరినీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ పదవులకు నామినేట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య కాంగ్రెస్‌కు ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు సభలోని మొత్తం సభ్యుల్లో పదిశాతం ఉంటే చాలు. ఆ మేరకు ఆజాద్ ప్రతిపక్ష నేత పదవి పొందడం ఖాయమైంది. ఇప్పటికే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కర్ణాటకు చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గేను, ఉప నాయకుడిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ను నియమించడం తెలిసిందే.