సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు మరోసారి టెలివిజన్ తెరముందు ప్రత్యక్షమై దేశంలో కరోనా వైరస్‌ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గత నెల రోజుల్లో టెలివిజన్ తెరమీదకో, రేడియోలోకో వచ్చి సామాజిక దూరం పాటించండని, చప్పట్లు కొట్టండని, లైట్లు ఆర్పేయండీ, కొవ్వొత్తులు వెలిగించండంటూ పిలుపునిచ్చారు. అష్టకష్టాలకు ఓర్చుకొని ఇళ్లకు పరిమితమవుతూ సామాజిక దూరం పాటిస్తున్నందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ఎంతో వినమ్రంగా చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు నిర్వర్తించాల్సిన విధుల గురించి ఆయన ఎంతో చక్కగా విడమర్చి చెప్పారు.
కానీ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో వివరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా 600 ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని, లక్ష పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనతో అన్నార్థులను ఆదుకుంటామని అన్నారు. పంటల కోతలను అనుమతించాలని అధికారులకు సూచించారు. అంతకుమించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పనేలేదు. రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయి ఆకలిదప్పులతో అలమటిస్తున్న వలస కార్మికుల సంగతేమిటీ? ఉపాధి కోల్పోయి రోడ్డునపడి రేషన్ కార్డులు, భవన నిర్మాణ కూలీల కార్డులు లేక అన్నమో రామచంద్రా! అంటున్న వారి సంగేతేమిటో చెప్పనేలేదు. (మోదీ ముందుంది అతి పెద్ద సవాల్!)
ఉపాధి కోల్పోయిన పేదలకు రేషన్ కార్డులపై అదనంగా బియ్యం, పప్పులతోపాటు నెలకు 1500 నుంచి 2000 రూపాయల వరకు నగదు చెల్లిస్తామని పలు రాష్ట్రాలు హామీ ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు ఇంతవరకు నగదును చెల్లించలేక పోయాయి. ఈ విషయాలను ప్రస్తుతానికి పక్కన పెడితే అత్యవసరంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
1. ప్రధాన మంత్రి కళ్యాణ్ యోజన పథకాన్ని కేవలం లబ్దిదారులకే కాకుండా ఇతరులకు వర్తింప చేస్తారా? అందుకు సరసడా నిధులు అందుబాటులో ఉన్నాయా?
2. రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికుల సంగతి ఏమిటీ? వారిని మాతృరాష్ట్రానికి లేదా అతిథి రాష్ట్రానికి పంపిస్తారా? లేదా లాక్‌డౌన్ ముగిసే వరకు సరిహద్దు తాత్కాలిక షెల్టర్లలో ఉండాలా? వలస కార్మికులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
3. తాత్కాలిక షెల్టర్లు ఆరోగ్యకరంగా లేకపోతే వారేమి చేయాలి?
4. వారి మీద పోలీసులు అన్యాయంగా లాఠీచార్జీ చేయకుండా చర్యలేమైనా తీసుకుంటారా?
5. తర తమ భేదం లేకుండా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికి రేషన్ బియ్యం సరఫరాకు చర్యలు తీసుకుంటారా?
6. గిడ్డంగుల్లో పేరుకుపోయిన అధనపు ధాన్యం నిల్వలను కేంద్రం విడుదల చేస్తుందా?
7. రాష్ట్రాలకు బకాయి పడివున్న కోట్లాది రూపాయల నిధులను కేంద్రం విడుదల చేస్తుందా?
8. రాష్ట్రాలకు అవసరమైతే కేంద్రం అప్పులిస్తుందా?
9. దేశంలో వైద్య వ్యవస్థ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
10. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్ సూట్ల కొరత తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
11. కరోనా పరీక్షల కిట్ల సంగతేమిటీ? ఆర్‌టీ–పీసీఆర్, యాంటీబాడీ రెండు విధాన పరీక్షలకు సంబంధించిన కిట్లు ఉన్నాయా?
12. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా పరికరాల నిల్వలు ఎంతున్నాయి?
13. లాక్‌డౌన్‌తో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ఉద్దీపణ పథకాలేమైనా సిద్ధం చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్రం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment