‘భారత్ మాతా కీ జై’ అనొద్దు
దారుల్ ఉలూమ్ ఫత్వా
సహరాన్‌పూర్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసింది. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్‌ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని సమర్థించినట్లే: వీహెచ్‌పీ
ఫత్వాని వీహెచ్‌పీ తీవ్రంగా తప్పుపట్టింది. దారుల్ ఉలూమ్ బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్ధించినట్లేనని అభిప్రాయపడింది. ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ లింకుపెట్టకూడదన్న ప్రధానిమోదీ విధానానికిఈ ఫత్వాతో తక్షణం బదులిచ్చారని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని, అది ఫ్యాషన్ కాదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు ఎందుకు ఫత్వాలు జారీచేయలేదని ఆయన కోల్‌కతాలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.