బ్రేకప్ చెప్పిందని పగతో రగిలిపోతూ.. | lover Seeking revenge for break up with him and finally arrested | Sakshi
Sakshi News home page

బ్రేకప్ చెప్పిందని పగతో రగిలిపోతూ..

Published Thu, Jun 29 2017 4:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

బ్రేకప్ చెప్పిందని పగతో రగిలిపోతూ..

బ్రేకప్ చెప్పిందని పగతో రగిలిపోతూ..

ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పిందన్న కారణంగా ఆమెపై పగ పెంచుకున్నాడు ఓ వ్యాపారి.

బెంగళూరు: ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పిందన్న కారణంగా ఆమెపై పగ పెంచుకున్నాడు ఓ వ్యాపారి. చివరికి ఆమెను అంతమొందించాలన్న ప్లాన్ బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యాడు. ప్రియుడితో పాటు మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి... బొమ్మనహళ్లికి చెందిన ప్రమోద్(32) బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల కిందట ఓ యువతి పరిచయమైంది. ఆపై వీరి పరిచయం ప్రేమగా మారింది. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న అనంతరం ఇటీవల భేదాభిప్రాయాలు రావడంతో ప్రమోద్‌కు ప్రేయసి బ్రేకప్ చెప్పేసింది.

తనతో రిలేషన్‌ను తెగదెంపులు చేసుకుందన్న కారణంగా ప్రియురాలిపై వ్యాపారి ప్రమోద్ ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెను అసభ్యంగా వేధించాలని కుమార్ అనే యువకుడిని పురమాయించాడు. కుమార్ తరచుగా ప్రమోద్ ప్రేయసికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడేవాడు. తన ప్రేయసిని గాయపరచాలని అవసరమైతే ఏం చేసేందుకైనా వెనుకాడవద్దని కుమార్‌కు చెప్పి, రూ.1.10 లక్షలు ఇచ్చాడు. ప్రమోద్ ప్రేయసిపై దాడి చేయాలని మరో ఇద్దరితో కలిసి కుమార్ ప్లాన్ చేశాడు. బన్సావాడిలో ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు యువతి సిద్ధమైంది. యువతి స్కూటీ వద్దకు రాగానే ముగ్గురు ఆమెను సమీపించారు. ఇద్దరు యువతిని గట్టిగా పట్టుకోగా కుమార్ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

ఓ వైపు యువతి సాయం కోసం కేకలు వేస్తుండగా, మరోవైపు కుమార్ మూడుసార్లు కత్తితో పొడిచాడు. స్థానికులను చూసి భయంతో నిందితులు పరారయ్యారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా ఆమె ప్రియుడు ప్రమోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. తనకు బ్రేకప్ చెప్పినందుకే ప్రేయసిపై ఈ అఘాయిత్యానికి సుపారీ ఇచ్చినట్లు వ్యాపారి అంగీకరించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement