నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి.. | Madhuri Dixit recalls her long-distance relationship days on 'Jhalak Dikhhla Jaa' | Sakshi
Sakshi News home page

నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి..

Published Thu, Aug 7 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి..

నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి..

ముంబై: ‘మీ ప్రదర్శన చూస్తుంటే నా పెళ్లినాటి రోజులు గుర్తుకొస్తున్నాయి..’ అని ఒకప్పుడు బాలీ వుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ వ్యాఖ్యానించింది. కలర్స్ చానల్‌లో ప్రసారమవుతున్న ‘జలక్‌ధిఖ్ లాజా -7’ డ్యాన్స్ పోటీలకు న్యాయనిర్ణేతల్లో మాధురి ఒకరిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా పోటీదారు మౌనీ, ఆమె కొరియోగ్రాఫర్ పునీత్ కలిసి ప్రదర్శించిన ‘మిర్రర్ ఇమేజ్’ ప్రదర్శన సందర్భంగా మాధురీ పై విధంగా స్పందించింది.

 ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటును ఈ ప్రదర్శనలో మైనీ, పునీత్ కళ్లకు కట్టినట్లుగా చూపించారని, వారి హావభావాలు చూస్తే తన పెళ్లినాటి రోజులు గుర్తుకొచ్చాయని మాధురి అంది. ‘నాకు శ్రీరాంతో పెళ్లి కాగానే యూఎస్ వెళ్లిపోయా. తర్వాత ‘దేవదాస్’ సినిమా షూటింగ్ నిమిత్తం తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది. నాలుగైదు నెలలు పాటు ఆ సినిమా షూటింగ్‌లో బిజీగా ఇండియాలోనే గడిపా. షూటింగ్‌లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించేదాన్ని.. కాని మనసు మాత్రం అమెరికాలో ఉన్న నా భర్త చుట్టూనే తిరుగుతుండేది.. అతడిని చాలా మిస్ అవుతున్నాననే బాధను బయటకు కనిపించకుండా ఉంచేందుకు చాలా శ్రమపడేదాన్ని.

ఆ నాలుగైదు నెలలూ మేమిద్దరం ‘ఐ మిస్ యూ’ అని చెప్పుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.. అంతలా బాధపడ్డాం.. మీ ఇద్దరి నటన చూసేసరికి ఆ రోజులు గుర్తుకొచ్చాయి..’ అంటూ మౌనీ జంటను ఆమె అభినందించింది. ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రసారం కానుంది. కాగా, మాధురి పెళ్లినాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నప్పుడు ఆమె భర్త శ్రీరామ్ మాధవ్ నెనే పక్కనే ఉండటం విశేషం. కాగా, మౌనీ, పునీత్ ప్రదర్శన మిగతా న్యాయమూర్తులైన రెమో డీసౌజా, కరణ్ జోహార్‌ల ప్రశంసలను సైతం అందుకుంది. ఇదిలా ఉండగా, మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 47 యేళ్ల వయసులోనూ అందచందాల్లో యువ హీరోయిన్లతో పోటీపడుతోంది. యోగా, డ్యాన్స్ తన గ్లామర్ రహస్యమని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె నటించిన ‘దేడ్‌ఇష్క్’ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement