
దిందోరీ : కొందరికి తరచూ టీ తాగడం, మరికొందరికి సిగరేట్ తాగడం.. ఇంకొందరికి మద్యం సేవించడం... ఇలాంటి అలవాటు ఉంటాయి. కానీ గాజు ముక్కలు తినడం ఎవరికైనా అలవాటు ఉంటుందా? నాకు ఉందని చెబుతున్నాడు మధ్య ప్రదేశ్‌కు చెందిన దయారాం. దిందోరీ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది దయారాం సాహుకు గాజు పెంకులంటే ప్రాణం. బాటిల్ కనిపిస్తే చాలు.. అతడికి నోరూరుతుంది. వెంటనే దాన్ని ఖాళీ చేసి పరపరా నమిలేయాలనేంత ఆశ పుడుతుంది. అందుకే ఇంట్లో వాళ్లు ఆయనకు గాజు సీసాలను దూరంగా పెడతారు. దయారాం 40 ఏళ్లుగా గాజు పెంకులు తింటున్నట్లు జాతీయ వార్త సంస్థకు తెలిపాడు.
‘ఇది నాకు ఒక వ్యసనం. దీనివల్ల నా పళ్లు దెబ్బతిన్నాయి. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలని అనిపించేది. మొదటగా గాజు తిన్నప్పుడు కొంచెం రుచిగా అనిపించింది. నేను గాజు తింటున్నానని తెలియడంలో ప్రజలు ఆశ్చర్యపోయారు. నన్ను ప్రత్యేకంగా చూశారు. దీంతో నేను ఇంకా ఎక్కువ గాజులు తినడం మొదలెట్టాను. ఇప్పుడు ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఇలా గాజు పెంకులు తినాలని నేను ఎవరూ సూచించను. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నేను కూడా వీటిని తినడం బాగా తగ్గించాను’అని దయారాం సాహు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment