అమెరికాలో తన పర్యటనను పురస్కరించుకుని న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సభ
న్యూయార్క్: అమెరికాలో తన పర్యటనను పురస్కరించుకుని న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సభ అద్భుతంగా సాగిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘భారతీయ అమెరికన్లు నన్ను అద్భుతంగా ఆహ్వానించారు. వారితో ముచ్చటించడానికి అదో ప్రత్యేక అవకాశం. వారికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. భారతీయ అమెరికన్లు తమ కృషి, విలువలతో ఎనలేని గౌరవాన్ని సంపాదించకున్నారని, వారిని చూసి గర్వపడుతున్నామని కొనియాడారు.
కాగా, మేడిసన్ స్వ్కేర్‌లో మోడీ ప్రసంగం ఆ సభకు హాజరైన 40 మందికిపైగా అమెరికా కాంగ్రెస్ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. మోదీ ఆకర్షణీయ నేత అని, ఆయనను ప్రజలు ప్రధానిగా ఎందుకు ఎన్నుకున్నారో ఆయన మాటలతో అర్థమైందని హెన్రీ హాంక్ అనే కాంగ్రెస్ సభ్యుడు అన్నారు.