రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..! | Modi Tells Madison Sq Garden India Won't Look Back | Sakshi
Sakshi News home page

రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..!

Published Mon, Sep 29 2014 1:34 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..! - Sakshi

రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..!

నవభారతం నిర్మిద్దాం కలసిరండి 
ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపు

 
న్యూయార్క్: మది నిండా భారతీయం ఉప్పొంగిన వేళ.. మాతృభూమిని స్మరిస్తూ మువ్వన్నెల్లో మునిగిన తరుణం.. అభివృద్ధి మాంత్రికుడిపైనే ఆలోచనలన్నీ ముసిరిన క్షణాన ప్రవాసులంతా ఉర్రూతలూగిపోయారు. 125 కోట్ల భారతావని ప్రతినిధిగా అమెరికాలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. 21వ శతాబ్దం మనదేనంటూ ఆద్యంతం ఉత్తేజం నింపిన ప్రధానికి  తమ పూర్తి మద్దతు తెలిపారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన భారీ సభలో మోదీ చేసిన ప్రసంగానికి ఆహూతులంతా మురిసిపోయారు. ‘భారత్ మాతాకీ జై’ అని ప్రారంభిస్తూ సహజమైన హావభావాలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా నడిబొడ్డున.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగిన మోదీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. నవరాత్రి ఉపవాసాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆయన నవయువకుడిగా మారిపోయారు. ప్రధాని పలికిన ప్రతి మాటకూ చప్పట్లు మారుమోగాయి. మోదీ నామస్మరణతో మేడిసన్  స్క్వేర్  లోపలాబయటా  హోరెత్తిపోయింది.  దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది పరోక్షంగా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఆద్యంతం ఉత్సాహభరిత ప్రసంగంతో ఎన్‌ఆర్‌ఐలనే కాదు.. అమెరికన్ల మదినీ దోచుకున్నారు. భారత శక్తియుక్తులను, తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే.. మాతృదేశాన్ని అభివృద్ధి చేయడానికి కలిసిరావాలంటూ ప్రవాసులందరికీ ప్రధాని మోదీ పదేపదే పిలుపునిచ్చారు.

అట్టహాసంగా ప్రారంభం

మేడిసన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్‌ఆర్‌ఐలు, అమెరికన్లు భారీగా తరలివచ్చారు. ప్రాంగణమంతా భారతీయత ఉట్టిపడింది. జాతీయ పతాకాలు చేతబూని, మోదీ మాస్క్‌లు, టీషర్ట్‌లు ధరించి అక్కడికి వచ్చిన వారంతా హంగామా చేశారు. సీట్లన్నీ నిండిపోయి మేడిసన్ స్క్వేర్ మొత్తం కిక్కిరిసిపోయింది. బయట ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భారతీయ నృత్యాలు, పాటలతో కళాకారులు ప్రదర్శనలిచ్చారు. పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. మోదీ ప్రవేశంతోనే హాలంతా ఆయన పేరే మారుమోగిపోయింది. మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్, తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మోదీ ప్రసంగానికి ముందు ప్రఖ్యాత గాయని కవితా కృష్ణమూర్తి జాతీయగీతాన్ని ఆలపించారు. ‘సోదరసోదరీమణులారా’ అని పలకరించిన మోదీ.. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తిగా స్వచ్ఛమైన హిందీలో ఆయన ప్రసంగం సాగింది.

ఇప్పుడు ‘మౌస్’తో ఆడుకుంటున్నాం

అమెరికాలో స్థిరపడిన భారతీయులను మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. వారి వల్లే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. భారతీయ అమెరికన్లను చూసి దేశం గర్వపడుతోందన్నారు. పాములను ఆడించే దేశంగా ప్రపంచానికి తెలిసిన భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేశారని ప్రస్తుతించారు. ఇప్పుడు మనం ‘మౌస్’తో ఆడుకుంటున్నామని చమత్కరించారు. ‘మీలో చాలా మంది ఓటు వేసి ఉండకపోవచ్చు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మీరంతా సంబరాలు చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఇవాళ ఇక్కడున్నాను. భారత అభివృద్ధిలో మీ పాత్ర ప్రధానమైనది’ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.  
 
15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు..


‘మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికల్లో ఒకే పార్టీ పూర్తి మెజారిటీతో ఘనవిజయం సాధించింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు. ఓటర్లు వారి అభిప్రాయాన్నే మార్చేశారు. ఎన్నికల్లో గెలవడం కుర్చీ కోసమో.. అధికారం కోసమో కాదు. అది ఒక బాధ్యత. అధికారం చేపట్టినప్పటి నుంచి 15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు. మీతో(ప్రవాస భారతీయులు) పాటు భారతీయులు కూడా దేశం గురించి ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మా ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. వాటిని నెరవేర్చడంలో మేం కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

 
21వ శతాబ్దం మనదే.. 21వ శతాబ్దం ఆసియాదేనని ప్రపంచమంతా అంగీకరించిందని మోదీ అన్నారు. ‘మనది యువ దేశం. 65శాతం మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారే. నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. యువశక్తి, నైపుణ్యాలతో భారత్ వెనక్కితిరిగి చూడాల్సిన పనిలేదు. అభివృద్ధి పథంలో వేగంగా సాగుతుంది’ అని ప్రధాని అన్నారు. ‘ఎవరికీ లేని మూడు ప్రధాన బలాలు భారత్‌కు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, యువశక్తి, డిమాండ్ - ఈ మూడు శక్తులే భారత్‌కు చోదకాలు. అందుకే ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. భారత్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది’ అని మోదీ తెలిపారు.

నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది

‘అహ్మదాబాద్‌లో కిలోమీటర్ దూరం ఆటోలో వెళ్లడానికి రూ. 10 ఖర్చవుతుంది. అంగారకుడిని చేరడానికి 65 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. ఇందుకు కిలోమీటర్‌కు 7 రూపాయలే ఖర్చు చేశాం. హాలీవుడ్ సినిమాకయ్యే వ్యయం కన్నా తక్కువలోనే తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపించాం. మన నైపుణ్యానికి ఇదే నిదర్శనం. అపార నైపుణ్యాలు, సామర్థ్యం మనకుంది. వాటితోనే ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. అందుకే నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఎన్‌ఆర్‌ఐలకూ పిలుపునిచ్చారు.

ఇవే నా లక్ష్యాలు..

మోదీ ఈ సందర్భంగా తన లక్ష్యాలను వివరించారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్, అందరికీ ఇళ్లు, మేకిన్ ఇండియా వంటి పథకాల ఆవశ్యకతను వెల్లడించారు. ‘దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో విస్తరించినప్పటికీ ఇంకా 50 శాతం మంది కుటుంబాలకు ఖాతాలు లేవు. ప్రైవేటుగా రుణాలు తీసుకునే పేదలను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నారు. అందుకే జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికే 4 కోట్ల మందికి ఖాతాలు తెరిచాం. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరుస్తామని చెప్పాం. కానీ జనం ఆ ఖాతాల్లో రూ. 1,500 కోట్లు జమ చేశారు. ఇక తగినన్ని మానవ వనరులు, తక్కువ రేట్లకే ఉత్పత్తి కావాలంటే మీ గమ్యం భారతే. ఇందుకు పాలనా వ్యవస్థను సులభతరం చేస్తున్నాం. భారత భవిష్యత్తు మార్చడానికి మాతో కలిసిరండి’ అని మోదీ పిలుపునిచ్చారు. పనికిరాని చట్టాలను తొలగిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు.

ప్రవాసులకు నజరానా..

ప్రవాస భారతీయులకు మోదీ వరాలు ప్రకటించారు. పీఐవో కార్డులు ఉన్నవారికి వీసాల సమస్యలను తొలగించనున్నట్లు తెలిపారు. వారికి జీవితకాల వీసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పీఐవో, ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) స్కీములను కలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే భారత పర్యటనకు వచ్చే అమెరికన్లకు వీసా ఆన్ అరైవల్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘గాంధీ’ కూడా ఒకప్పుడు ప్రవాస భారతీయుడే. ఆయన దక్షిణాఫ్రికాలో బారిస్టర్ చదివి దేశానికి సేవ చేయడానికి భారత్‌కు తిరిగొచ్చి వచ్చే ఏడాదికి వందేళ్లు పూర్తవుతుంది. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న ప్రవాసీ భారతీయ దివస్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తాం. మనం కూడా మన మాతృదేశానికి సేవ చేసేందుకు చేతులు కలుపుదాం’ అని ఆయన పిలుపునిచ్చారు. చివరగా.. తనకు అమిత గౌరవాన్ని అందించిన భారతీయ అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులు కోరుకుంటున్న నవభారత్‌ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం.,. దేశ ప్రజల కోసం.. తన వల్ల సాధ్యమైనదంతా ఎలాంటి ఆపేక్ష లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. భారత్ మాతాకీ జై.. అంటూ  ప్రసంగాన్ని ముగించారు.
 
 అభివృద్ధి ఉద్యమం రావాలి

స్వాతంత్య్రం కోసం ప్రజా ఉద్యమం వచ్చినట్టే ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం రావాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ‘ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులే ఉంటారు. మహాత్ముడు స్వాతంత్య్రోద్యమాన్ని ఎలా ప్రజా ఉద్యమంగా మార్చారో ఇప్పుడు అభివృద్ధి కూడా అలాగే మన ఉద్యమం కావాలి. సుపరిపాలన దిశగా ముందడుగు పడాలి. 125కోట్ల భారతీయులే నా బలం. 2020కల్లా ప్రపంచమంతా ముసలివాళ్లతో నిండుతుంది. అప్పుడు మనమే వారికి మానవ వనరులను అందిస్తాం. యువశక్తిని ఉపయోగించుకుని ప్రపంచాన్నే జయిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.
 
 
 చిన్నవాణ్ని.. చిన్న వారి గురించే ఆలోచిస్తా..
 
‘నేను పేదవాణ్ని.. చిన్న వాణ్ని. అందుకే చిన్న ఆలోచనలే చేస్తాను. చిన్న చిన్న వారి కోసం పెద్దపెద్ద పనులు చేస్తాను’ అని మోదీ అన్నారు. దేశంలోని 40 శాతం మంది ప్రజల ఆర్థిక ప్రతినిధి గంగానదేనన్నారు. గంగ ప్రక్షాళన ద్వారా వారందరి జీవితాల్లోనూ మార్పు వస్తుందన్నారు. ‘2019లో గాంధీ 125వ జయంతి జరగనుంది. ఆయనకు ఇష్టమైన పనులు చేద్దాం. 2022కి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దాన్ని ఎలా నిర్వహించాలి. అప్పటి వరకు దేశంలో ఇల్లులేని కుటుంబం ఉండకూడదన్నది నా కల. ఇలాంటి చిన్న చిన్న వాటితోనే దేశం మారుతుంది’ అని పేర్కొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement