మోదీ సభ సైడ్‌లైట్స్
► మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని 360 డిగ్రీల వర్తులాకార వేదిక పైనుంచి మోదీ 20 వేల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, 45 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు.
► వేదికపైకి చేరుకునే క్రమం నుంచి ఆయన ప్రసంగం కొనసాగించినంత సేపూ సభికులు ‘మోదీ...మోదీ, ‘వెల్‌కమ్ మోదీ’, ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
► సభకు చాలా మంది భారతీయ అమెరికన్లు మోదీ ముఖచిత్రంతో కూడిన టీషర్టులను ధరించి వచ్చారు. ‘అమెరికా లవ్స్ మోదీ’ అనే బ్యానర్లను ప్రదర్శించారు.
► ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లోని భారీ తెరలపై మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికావ్యాప్తంగా 50 చోట్ల ప్రత్యక ప్రసారాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
► మోదీ ప్రసంగానికి ముందు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గుజరాతీ కళాకారుల నృత్యాలతో వేదిక హోరెత్తింది. వాయిలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రహ్మణ్యం, ఆయన భార్య, గాయని కవితా కృష్ణమూర్తి ‘ఐ లవ్ మై ఇండియా’ గానం సభికుల ప్రశంసలందుకుంది.
► మోదీ ప్రసంగం వినేందుకు 100 మంది బోహ్రా ముస్లింలు వచ్చారు.
► అమెరికాలోని పలు భారత సంఘాలు 15 లక్షల డాలర్లు ఖర్చు చేసి సభను ఏర్పాటు చేశాయి.
► మేడిసన్ స్క్వేర్ ఎదుట మోదీ వ్యతిరేకులు మోదీ వీసా రద్దు చేయాలని, హిందుత్వ విధానం భారత్‌ను నాశనం చేస్తోందంటూ బ్యానర్లు ప్రదర్శించినా ఆ ప్రభావం సభపై కనిపించలేదు.
► సభ ప్రారంభానికి ముందు ప్రముఖ భారత జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత రాజ్‌దీప్ సర్దేశాయ్‌పై సభా ప్రాంగణం వెలుపల దాడి జరిగింది. గతంలో మోదీని విమర్శించారంటూ పలువురు మోదీ మద్దతుదారులు సర్దేశాయ్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ దాడి చేశారు.
► పాప్ రారాజు మైకేల్ జాక్సన్ స్టెప్పులతో తరించింది... మడోన్నా గాత్రంతో పులకించింది... బాస్కెట్ బాల్, ఐస్ హాకీ వంటి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది మేడిసన్ స్క్వేర్ గార్డెన్. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా నిలిచిన న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోదీ ఆదివారం తన ప్రసంగంతో చుట్టూ ఆసీనులైన ప్రతీ భారతీయ అమెరికన్‌ను ఊర్రూతలూగించారు. తద్వారా ఇదే వేదికపై నుంచి ప్రసంగించిన ప్రముఖుల జాబితాలో మోదీ చేరిపోయారు.
► మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రసంగించిన ఓ దేశాధినేత కూడా మెదీయే కావడం విశేషం.