సహకార రుణాలు మాఫీ చేయండి
తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశం
- భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా పంట,బంగారు రుణాలు మాఫీ చేయాలంటూ తీర్పు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రైతు రుణాలపై మద్రాస్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. సహకార సంఘాల నుంచి రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించడంలో విఫలమైన రైతులపై చర్యలు తీసుకోకుండా సహకార సంఘాలు, బ్యాంకులను నియంత్రించాలని సూచించింది. తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నందున, ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి తగిన సాయమందించాలని సూచించింది. తీవ్ర కరువుతో అన్నదాతలు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని జాతీయ, దక్షిణాది నదుల అనుసంధాన వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దిక్కుతోచని రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు బ్యాంకుల్లో అప్పులు చేశారని తెలిపారు. కానీ కరువు వల్ల పంట చేతికందక పోవడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు.
రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఐదెకరాలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిందని వివరించారు. భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరి రుణాలను రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.నాగముత్తు, జస్టిస్ ఎం.వి.మురళీధరన్ మంగళవారం విచారించారు. రుణమాఫీ ద్వారా రైతులందరికీ లబ్ధి చేకూర్చాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహకార సంఘాల నుంచి రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాల ను భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా రద్దు చేయాలని తీర్పు వెలువరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రప్రభుత్వం మౌనం వహించకుండా, తమిళనాడుకు సాయమందించాలని సూచించింది. గత కొన్ని రోజు లుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న తమిళనాడు రైతు సంఘాలు తీర్పును స్వాగతించాయి.