
ముంబై : దసరా పండుగ నాడు దేశ వ్యాప్తంగా రావణాసుర వధ జరగడం ఆనవాయితి. కానీ మహారాష్ట్రలో మాత్రం వెరైటీగా రావణాసురిడి సోదరి శూర్పనఖ బొమ్మను దహనం చేశారు. ఇది ఎక్కడి వింత ఆచారం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఆచారం కాదు.. భార్యల వల్ల పడుతున్న అగచాట్లను తెలియజేయడం కోసం ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను కాల్చారు. ఈ వెరైటీ సంఘటన ఔరంగాబాద్‌లోని కరోలి గ్రామంలో చోటు చేసుకుంది.
‘పత్ని పీడిత్ పురుష్ సంఘటన’(భార్య బాధితుల సంఘం) సభకు చెందిన సభ్యులు తమను వేధిస్తున్న భార్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ పనికి పూనుకున్నారు. ఈ విషయం గురించి సదరు సంఘానికి చెందిన ఓ వ్యక్తి ‘మా భార్యలు మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. మన దేశంలో చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాయి. వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. భార్యల వేధింపులకు గుర్తుగా మేము ఈ రోజు ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను దహనం చేశాము’ అని తెలిపారు.