కమలనాథుల సంబరాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం, మహారాష్ట్ర, హర్యానా పార్టీ కార్యాలయాలు బాణసంచా పేలుళ్లతో మారుమోగాయి. కార్యకర్తలు, పార్టీ నేతలు డప్పులు వాయిస్తూ.. డాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు ఇదే హవాను దేశవ్యాప్తంగా మిగిలిన ఎన్నికల్లోనూ కొనసాగించి అన్ని రాష్ట్రాలనూ కైవసం చేసుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. బీహార్, కాశ్మీర్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలే ప్రతిఫలిస్తాయని ఆ రాష్ట్రాల బీజేపీ శ్రేణులు నమ్మకంగా చెపుతున్నాయి.
మోదీ పాలనకు ప్రజలు వేసిన ఓటు: వెంకయ్య
ప్రధాని మోదీ పాలనకు మెచ్చి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథాన సాగాలన్న ఉద్దేశంతో అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు వేసిన ఓటుగా ఈ ఫలితాలను భావిస్తున్నాం. పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని అవినీతి, అసమర్థ పాలనకు, పదేళ్లుగా హర్యానాలో అహంకార పూరిత కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు’ అని వెంకయ్య అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రులే పాలనాపగ్గాలు చేపడతారని వెంకయ్య స్పష్టం చేశారు.