మేక్ ఇన్ తెలంగాణ
- పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం
- ఢిల్లీలో వివిధ దేశాల ప్రతినిధులను కలసి వివరించిన కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేక్ ఇన్ తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను భారీగా ఆకర్షించే లక్ష్యంతో రెండ్రోజుల హస్తిన పర్యటనకు శ్రీకారంచుట్టిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం తొలి రోజు వివిధ దేశాల ప్రతినిధులను కలుసుకున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకు కల్పిస్తున్న అనువైన వాతావరణం తదితర అంశాల గురించి వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆయా పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు జపాన్ ఎంబసీలో ఉప రాయబారి యుపక కికుటను కేటీఆర్ కలసి తెలంగాణ పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, సులభతరమైన పెట్టుబడి విధానాలను వివరించారు.
మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా జపాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం మలేసియా ఉప ప్రధాని డాక్టర్ అహ్మద్ జహీద్ హమీదితో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నెలకొన్న అనువైన వాతావరణం గురించి ఆయనకు వివరించారు. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో భేటీ అయిన కేటీఆర్...హైదరాబాద్‌లో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటులో భాగస్వామిగా ఉండాలని కోరారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో డిజిటైజేషన్ కార్యక్రమాలను ఈ సదస్సులో వివరించారు. ఆపై తైవాన్ రాయబారి చుంగ్ కవాంగ్ తైన్, దక్షిణ కొరియా రాయబారి హ్యున్ ఛోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆయా దేశాల పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశాలు ముగిశాక కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రాను కలసి తెలంగాణలో ఆయా పరిశ్రమల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పూర్తి సహకారానికి జపాన్ హామీ...
తొలి రోజు పర్యటన వివరాలను కేటీఆర్ మీడియాకు వివరిస్తూ ‘‘ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఐటీ, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులను కలిశా. మేక్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో జపాన్‌కు సంబంధించిన పెద్ద సంస్థలను ఆహ్వానించేందుకు ఆ దేశంలో పర్యటించాలనుకుంటున్నాం. అందుకు సహకరించాలని కోరేందుకు జపాన్ ఎంబసీలో హైకమిషన్ అధికారిని కలిశాను. పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. మన విధానాలు, పెట్టుబడులకుగల అవకాశాలను వివరించాం. అలాగే దక్షిణ కొరియా, తైవాన్ దేశాల ప్రతినిధులు, మలేసియా ఉప ప్రధానితోనూ సమావేశమయ్యాను.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సెంటర్ క్యాంపస్‌లో భాగస్వామిగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్‌ను కలసి విజ్ఞప్తి చేయగా త్వరలోనే ఒక బృందాన్ని పంపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. హడ్కో, నేషనల్ హౌసింగ్ బోర్డు సీఈవోను కలిశాం. తెలంగాణకు సంబంధించి మిషన్ భగీరథ, హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ. 745 కోట్ల రుణం కావాలని అడిగాం. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. డిజైనింగ్ ఏ స్మార్ట్ నేషన్ అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో డిజిటైజేషన్‌లో ఐటీ పాత్రపై చర్చ జరిగింది. తెలంగాణలో తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను వివరించాం. మంత్రి కల్‌రాజ్ మిశ్రాను కలిశాం. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల సమస్యలను చర్చించాం. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరానీని బుధవారం కలసి తెలంగాణకు అవసరమైన సాయాన్ని కోరుతాం’’ అని చెప్పారు.
ప్రధాని పర్యటన ఖరారు కాలేదు...
తెలంగాణలో ప్రధాని పర్యటనకు సంబంధించి మీడియా ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ ప్రధాని పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ‘‘తెలంగాణలో పర్యటించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (సోమవారం) ఆహ్వానించారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. ప్రధాని వస్తారని ఆశిస్తున్నా. సుహృద్భావ వాతావరణంలో ప్రధానితో సీఎం సమావేశం జరిగింది’’ అని వివరించారు. ఐటీఐఆర్‌ను మళ్లీ కేబినెట్‌కు తీసుకెళ్లి రీ డిజైన్ చేస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని ఓ ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు.