
బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి బుధవారం బీజేపీలో చేరారు. ఏప్రిల్ లో కేంద్రం ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మద్దతుతో ఆయన పెద్దల సభలో అడుగు పెట్టారు. అప్పుడే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయన బీజేపీలో చేరలేదు. ఇటీవల జరిగిన కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని భావించగా, పోటీ చేసేందుకు సురేశ్ గోపి విముఖత వ్యక్తం చేశారు.
2014 వరకు కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఆయన తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. 57 ఏళ్ల సురేశ్ గోపి నటుడిగా కొనసాగుతూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. బీజేపీలో చేరడం ద్వారా ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.