సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం, తదుపరి ఘటనలు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సీబీఐ చీఫ్ అలోక్ వర్మను సెలవుపై ఇంటికి పంపిచడం, ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా సీబీఐ డైరెక్టర్‌ను అలోక్ వర్మను సెలవుపై ఇంటికి పంపించడాన్ని కాంగ్రెస్ పార్టీ శనివారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల నిర్ణీత పదవీకాలం ఉంటుందని, సెలక్షన్ కమిటీ ఆమోదం లేకుండా డైరెక్టర్‌ను తప్పించడం, ట్రాన్స్‌ఫర్ చేయడం చట్ట విరుద్దమని తెలిపారు. సెలక్షన్ కమిటీలో ఉండే ముగ్గురు సభ్యులలో ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ జస్టిస్‌లతో పాటు తాను సభ్యుడినని, కానీ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో కలిసి సీబీఐ చీఫ్ను తొలగించేలా కుట్ర పన్నారని ఆరోపించారు. కేంద్రం, విజిలెన్స్ కమిషన్ సీబీఐ చీఫ్‌ను తప్పిస్తూ రాత్రికిరాత్రి తీసుకున్న నిర్ణయం అక్రమమని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేలా కేంద్రం జోక్యం చేసుకుందని మండిపడ్డారు.
అసలేం జరిగింది..
గత కొన్నేళ్లుగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాకేశ్ ఆస్థానా లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇక అరెస్టును తప్పించుకోవడానికి రాకేష్ ఆస్థానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలిద్దరినీ సెలవుపై ఇంటికి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment