
మాల్యా ఆస్తులు అటాచ్
ఐడీబీఐ రుణం కేసులో రూ.1,411 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ముంబై: ఐడీబీఐ బ్యాంకుకు రుణాన్ని ఎగవేసిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా, యూబీ సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,411 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో రూ.34 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరు.. ముంబైలలో రెండు ఫ్లాట్లు, చెన్నైలో పారిశ్రామిక ప్లాటు, కూర్గ్‌లో 28.75 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ స్థలం తదితరాలున్నాయి.
ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రూ. 900 కోట్ల పైచిలుకు రుణాల విషయంలో మనీ ల్యాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా మాల్యాతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న దరిమిలా మాల్యా .. దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.