
న్యూఢిల్లీ : ప్రశాంత్ కిషోర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం వెనక ప్రశాంత్ వ్యూహాలు ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం.. నరేంద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం వెనక కూడా పీకే వ్యూహాలు కీలకంగా పని చేశాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యూహకర్తగా ఉంటే గెలుపు తథ్యమనే అభిప్రాయం నాయకుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు దీదీ, పీకేతో భేటీ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో కలిసి పని చేయాల్సిందిగా దీదీ.. పీకేను కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బెంగాల్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యి.. తమ పార్టీ కోసం పని చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment