కోల్‌కతా : ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చల కోసం వెళ్లిన తనను వైద్యులు తిట్టి అవమానించారు అంటున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘అత్యవసర విభాగంలో సమ్మె చేస్తున్న వైద్యుల వద్దకు వెళ్లాను. వారు నాతో మాట్లాడారు కానీ వారు వాడిన పదజాలం సరిగా లేదు. నన్ను దూషించారు. నా స్థానంలో మరోకరుంటే.. ఇపాటికే వారి మీద చర్యలు తీసుకునే వారు. పరిస్థితి మరోలా ఉండేద’ని పేర్కొన్నారు.
‘వారు నన్ను వ్యతిరేకించినప్పటికి, దూషించినప్పటికి నేను వారిని క్షమిస్తున్నాను. ఎందుకంటే వారు నా కంటే చిన్నవారు. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరుతున్నాను’ అన్నారు. రాష్ట్రంలోని ఎన్‌ఆర్‌ఎస్ ఆస్పత్రిలో ఓ రోగి మరణించడంతో.. మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యుల మీద దాడి చేశారు. దాంతో విధి నిర్వహణలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందుకు సీనియర్లు కూడా మద్దతు తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా జూనియర్ డాక్టర్ల సమ్మెకు బీజేపీ, సీపీఎం మద్దతు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment