మృతుడి సోదరుడు
పట్నా : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తనను కూడా చంపాలంటూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగాడో వ్యక్తి. ఈ ఘటన బిహార్‌లోని ముజాఫర్‌పూర్ నగరంలో జరిగింది. ముజాఫర్‌పూర్‌కు చెందిన ఓవ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో రెండు నెలల క్రితం నగరంలోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన సోదరుడు మృతి చెందాడిని మృతుడి తమ్ముడు ఆరోపించారు. మెరుగైన చికిత్స అందించాలని కోరినా.. డాక్టర్లు స్పందించలేదని వాపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన సోదరుడిని డాక్టర్లు పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు.
‘రాష్ట్ర వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి సోకి చాలా మంది చనిపోతున్నారు. దీంతో మా సోదరుడికి మంచి చికిత్స అందించాలని డాక్టర్లను వేడుకున్నాం. అయినా స్పందించలేదు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ మంచి చికిత్స అందించకపోవడంతో నా సోదరుడు మృతి చెందాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నన్ను కూడా చంపండి. నాకు బతకాలని లేదు. డాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయనాయకులు వచ్చివెళ్లారు కానీ.. ఎవరూ సమస్యలపై ఆరా తీయలేదని’ మృతుడి సోదరుడు ఆరోపించారు. కాగా బీహార్ లో మెదడువాపు వ్యాధి మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 97కు చేరారు. ఒక్క ముజఫర్ పూర్ లోనే మృతుల సంఖ్య 84గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment