తిండి, గాలి, నీళ్లు లేకుండా 15 రోజులు బతికాడు!!
పట్నా: మనదేశంలో బాబాలు చాలా విన్యాసాలు చేస్తుంటారు. కొందరు గాలిలో విభూది ఉండలు, రుద్రాక్ష మాలాలు సృష్టిస్తే.. మరికొందరు నోటినుంచి శివలింగాలు రప్పిస్తూ ఉంటారు. ఈ విన్యాసాల వెనుక నిజమెంత? జిమ్మిక్కు ఎంత? అన్నది ఎప్పుడూ వివాదాస్పద అంశమే. ఇప్పుడు తాజాగా బిహార్‌లో ఓ బాబా కూడా ఇలాంటి విన్యాసమే చేశాడు. ఓ గోతిలో తనను తాను కప్పేసుకొని.. తిండి, నీళ్లు, ఆక్సీజన్ లేకుండా 15 రోజులు గడిపాడు. ఆ తర్వాత ఆ గోతి నుంచి ఎప్పటిలాగే ఆరోగ్యవంతంగా బయటపడ్డాడు.
బిహార్ లోని మాధేపురకు చెందిన ప్రమోద్ బాబు ఈ విన్యాసం చేశారు. కప్పివేసిన గోతి నుంచి ఆయన 15 రోజుల తర్వాత వెలికిరావడంతో ఈ బాబాను చూసేందుకు బిహార్ రాష్ట్రమంతటి నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వ్యవహారంతో మీడియాలో ప్రమోద్ బాబా హైలెట్ అయ్యారు.
అయితే బాబు విన్యాసంలోని ప్రామాణికతను వైద్యులు, హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. 15 రోజులు ఆక్సీజన్ లేకుండా మనుషులు జీవించలేరని, సదరు బాబా చేసిన విన్యాసం వట్టి బూటకమని కొట్టిపారేస్తున్నారు. ఆయన నిజంగా అలా చేయగలిగితే ల్యాబ్‌లో చేసి చూపించాలని సవాల్ విసురుతున్నారు.
'ఆక్సీజన్ లేకుండా మనుషులు బతకడం అసాధ్యం. సైన్స్ ప్రకారం ఇది నమ్మశక్యంకాని విషయం. యోగా, ధ్యానం సాధన ద్వారా శరీర అవసరాలను కొంతమేరకు నియంత్రించవచ్చు కానీ పూర్తిగా వాటి నుంచి వేరయి.. జీవించగలగడం అన్నది అసాధ్యం. అలా చేస్తూ మూడు నిమిషాల్లోనే మెదడుపై ఆ ప్రభావం పడుతుంది' అని ప్రముఖ వైద్యుడు కేకే పాండే తెలిపారు.