
సాక్షి, తిరువనంతపురం : కేరళలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని సీబీఎస్‌ఈ నిర్వహించే నీట్ పరీక్షకు పంపిన మరుక్షణమే గుండె పోటుతో ఓ తండ్రి హఠాన్మరణానికి గురయ్యారు. ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం తమిళనాడులోని తిరువూరు జిల్లాకు చెందిన కృష్ణస్వామి తన కుమారుడు కస్తూరి మహాలింగంను తాము బసచేసిన హోటల్ నుంచి ఆటోలో పరీక్షా కేంద్రానికి పంపారు. వెనువెంటనే తనకు అస్వస్థతగా ఉందని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని హోటల్ సిబ్బందికి తెలుపగా వారు సిటీ ఆస్పత్రికి తరలించారు.
ఉదయం 8.20 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న కృష్ణస్వామి స్పృహలోనే ఉన్నారని, ఆయన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే హఠాత్తుగా కుప్పకూలిన ఆయన తీవ్ర గుండెపోటుతో మరణించారని వెల్లడించాయి. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి తమిళనాడు సీఎం కే పళనిస్వామి రూ 3 లక్షల పరిహారం ప్రకటించారు.