న్యూఢిల్లీ: విడిపోయి అధికారికంగా విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని పెళ్లాడిన భార్య రెండవ భర్తను హత్య చేసిన వ్యక్తికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హర్యానాకు చెందిన ప్రమోద్ 2007లో పూజా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రమోద్ తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని అత డిని విడిచి వేరుగా ఉన్న ఆమె అనిల్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో అక్టోబర్ 3, 2008లో అనిల్ కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకుండా పోయాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు క్రమంలో పోలీసులు అనిల్ మొబైల్ ఫోన్ శోధించగా చివరిసారిగా ప్రమోద్ మాట్లాడినట్లు తెలిసింది. ప్రమోద్‌ను అరెస్టు చేసి విచారణ చేయగా అనిల్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి ఉమేద్‌సింగ్ గ్రేవాల్ ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా ప్రమోద్‌ను దోషిగా ప్రకటించి, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు.