
సహజీవనానికి అడ్డొస్తున్నాడని ఆవేశంలో..
చెల్లెలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని హెచ్చరించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని విజయ్ విహార్ ఏరియాలో అన్నా, చెల్లెలు నివాసం ఉండేవారు. అయితే తన చెల్లెలిని అదే ప్రాంతంలో ఉండే ఓ యువకుడు ప్రేమించాడు. ఈ క్రమంలో ఆమెను కొన్ని రోజుల కిందట కిడ్నాప్ చేశాడని, అప్పటినుంచీ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. గత శనివారం బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని వారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన నిందితుడు ఎలాగైనా సరే తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు వారి ఇంటికి వెళ్లి తుపాకీతో బెదిరించాడు.
బాధితురాలి సోదరుడు వారి రిలేషన్ షిప్ ను అంగీకరించలేదు. యువతితో తన సంబంధానికి అడ్డుచెప్పినందుకు నిందితుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో తాను ప్రేమించిన యువతి సోదరుడిపై కాల్పులు జరిపాడు. బాధితురాలి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతిచెందాడని పోలీసులు వివరించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధితుల పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.