కటిక చలిలో అమిత్‌షా కోసం..
న్యూఢిల్లీ: ఇప్పుడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం కిటకిటలాడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ చీఫ్‌ను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా సీటు దక్కించుకోవాలనే ఆరాటంతో ఆశావాహులంతా గుంపులుగా చేరి ఉంటున్నారు. రాత్రి అవగానే చలిని భరించలేక తిరిగి తమ ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. కానీ, వారెవ్వరూ కూడా మీడియాను ఆకర్షించలేకపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం మీడియాకు ఆసక్తిని రేపారు. గత మూడు రోజులుగా కటిక చలిలోనూ అక్కడి నుంచి వెళ్లకుండా భీష్మించుకొని కూర్చున్నాడు.
అతడే 46 ఏళ్ల రవికాంత్. అయితే, అతనేదో పార్టీ సీటుకోసమో, ఎమ్మెల్యే సీటుకోసమో అంటే కాదు.. బాలికల సమస్యను తీర్చాలనే తన డిమాండ్ నెరవేరడం కోసం. దాదాపు 2015 ఆగస్టు 12 నుంచే ఈ సమస్యపై పోరాటం ప్రారంభించిన ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినప్పటికీ ఫలితం లేకపోవడం ఇక ఏకంగా ఢిల్లీలోని అశోకా రోడ్డులోగల బీజేపీ హెడ్ క్వార్టర్స్ వద్దకు వచ్చారు.
బాలికలపై లైంగికదాడులను చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలనే డిమాండ్‌ను నేరుగా బీజేపీ చీఫ్ అమిత్ షాకు వినిపించాలని పట్టువీడకుండా అక్కడే ఎదురుచూస్తున్నాడు. బేటీ బచావో.. బేటీ పడావో అభియాన్ అనే పేరుతో రాసిన ఓ పలకలాంటిదాన్ని తన మెడకు తగిలించుకొని నిల్చున్నాడు. 'నేను పార్టీ చీఫ్‌ను కలవాలని మూడు రోజుల కిందటే కోరాను. కానీ, వారు నాకు ఇంత వరకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయనను కలిసి నా బాధను చెప్పేవరకు నేను వెళ్లను' అంటూ అతడు తెలిపాడు. ఇతడికి ఓ కూతురు ఉంది.